గిల్‌క్రిస్ట్‌నే కలవరపెట్టిన భారత బౌలర్‌ ఎవరంటే..!!

మెల్‌బోర్న్‌ : తన కెరీర్‌లో ఎదుర్కొన్న కష్టతరమైన బౌలర్లలో భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఒకరని  ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ తెలిపారు. అదేవిధంగా శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ బౌలింగ్‌లో కూడా ఇబ్బంది పడినట్లు వెల్లడించాడు. క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్‌లో 2001లో జరిగిన బోర్డర్‌- గవాస్కర్‌ సిరీస్‌లో 32వికెట్లు పడగొట్టిన భజ్జీ ఆసీస్‌కు కొరకరాని కొయ్యలా మారాడని ఈ సందర్భంగా గిల్‌క్రిస్ట్ గుర్తు చేసుకున్నాడు.


2001లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన రెండో టెస్టులో హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. ఈ టెస్టులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ముంబైలో జరిగిన తొలి టెస్టులో గిల్‌క్రిస్ట్ సెంచరీతో చెలరేగడంతో స్టీవ్ వా నాయకత్వంలోని ఆస్ట్రేలియా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తర్వాతి మ్యాచ్‌లలో హర్భజన్‌ చెలరేగడంతో భారత్‌ తదుపరి రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. దీంతో గంగూలీ సారథ్యంలోని టీమిండియా 2-1 తేడాతో సిరీస్‌ను చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.